Advertisement

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో మరో కేసు నమోదు

మన పత్రిక, గుంటూరు: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పోలీస్ కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేశారంటూ గుంటూరులోని అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఈ ఫిర్యాదు ఇచ్చారు.

రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ (AI) ద్వారా రూపొందించిన వీడియోలను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 356, 353, 352, 61(2), 3(5) కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇదే అంశంపై ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ (CID) కార్యాలయంలో ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement