మన పత్రిక, కడప: జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై PD Act కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కడప జిల్లా చెన్నూరు మండలానికి చెందిన షేక్ జహీరుద్దీన్ అలియాస్ అబ్బాస్ (30), తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలానికి చెందిన తొండ శాంతి అలియాస్ కాసమ్మ (36)పై ఈ ఉత్తర్వులు ఇచ్చారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జూలై 22న ఈ పి.డి. చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే సదరు వ్యక్తులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం షేక్ జహీరుద్దీన్‌పై ప్రభుత్వ విధులకు అడ్డంకి కలిగించడం, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం వంటి ఆరోపణలతో కడప జిల్లాలో 10 కేసులు ఉన్నాయి. మరో నిందితురాలు తొండ శాంతిపై వరుస దొంగతనాలు, ఆస్తి సంబంధిత నేరాలకు సంబంధించి కడపతో పాటు ఇతర జిల్లాల్లో మొత్తం 38 కేసులు నమోదయ్యాయి.
చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారిపై పి.డి. చట్టంతో పాటు జిల్లా బహిష్కరణ వంటి కఠిన చర్యలు మున్ముందు కూడా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసి పి.డి. చట్టం అమలు అయ్యేలా కృషి చేసిన పోలీసు అధికారులను ఆయన అభినందించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
