Advertisement

సిద్దిపేటలో రాహుల్ గాంధీపై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ భారీ ర్యాలీ

మన పత్రిక, సిద్దిపేట: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న NEET పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై మోదీ ప్రభుత్వం దాడికి పాల్పడటం అప్రజాస్వామికమని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్, నాయకుడు పూజల గోపికృష్ణ మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణల పిలుపు మేరకు బుధవారం సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది.

ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని, వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. విక్టరీ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో అత్తు ఇమామ్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పా అని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యల వల్లనే రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement