Advertisement

ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలని బీజేపీ నేతల పిలుపు

మన పత్రిక, పెద్ద శంకరంపేట: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేసుకునేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోణం విఠల్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేతలు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పార్టీ సమర్థవంతంగా పనిచేస్తోందని, బీజేపీ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, ఎం. కృష్ణ, బుగుడాల కృష్ణ, శంకర్రావు, సుకుమార్, ఎర్ర శ్రీహరి, భూషణం, నర్సింలు, అంజయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement