Advertisement

తెలంగాణలో మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మన పత్రిక: తెలంగాణ రాష్ట్రం నుంచి అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు గాను ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చేలా ధాన్యం సేకరణ కోటాను పెంచాలని ఈ నెల 8న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని తాము కలిసి కోరామని, ఆ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఆయన గుర్తుచేశారు.

రైతులకు మేలు జరిగేలా చర్యలు

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని సేకరించాలని ఆయన కోరారు. కేంద్రం కల్పించిన ఈ అదనపు కోటా ద్వారా రాష్ట్రంలో మిగిలి ఉన్న ధాన్యం సేకరణ సులభతరమవుతుందని, దీనివల్ల వేలాది మంది రైతు కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement