Advertisement

నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంటులో చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

మన పత్రిక: దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అంశంపై సభలో పారదర్శకంగా చర్చ జరగడం ద్వారా విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని కిరణ్ రిజిజు ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా వినిపించవచ్చని, అయితే చర్చకు షరతులు విధించడం అంటే వారు చర్చను కోరుకోవడం లేదనే అర్థం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏ సమస్య నుంచీ పారిపోదని, అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులు లేదా అఖిలేష్ యాదవ్ వంటి వారు ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చని, అయితే చర్చ మాత్రం సభా నిబంధనలకు అనుగుణంగానే సాగుతుందని ఆయన తెలిపారు. మరోవైపు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. నీట్ పరీక్ష లీకేజీపై చర్చకు తేదీ, సమయాన్ని ఖరారు చేసేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

Advertisement
Advertisement