Advertisement

తల్లికి వందనం పథకం: అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను మొత్తం రూ. 10,120.78 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారుల కోసం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67,47,190 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ పథకం ద్వారా విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో రూ. 13,000 నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కానుండగా, మిగిలిన రూ. 2,000 విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఖాతాకు వెళ్తాయి. ప్రభుత్వం ఈ నిధులను రెండు విడతల్లో విడుదల చేస్తోంది. తొలి విడతలో ఇప్పటికే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, రెండో విడతలో ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ సాయం అందనుంది. రాబోయే మూడు రోజుల పాటు ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Advertisement

స్టేటస్ తెలుసుకోవడం ఎలా

లబ్ధిదారులు తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు:

  • అధికారిక పోర్టల్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ని ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలో ‘స్టేటస్ చెక్’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • స్కీమ్ టైప్‌లో ‘తల్లికి వందనం’ అని ఎంచుకుని, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • స్క్రీన్‌పై ‘సక్సెస్’ లేదా ‘పేమెంట్ రిలీజ్డ్’ అని కనిపిస్తే నగదు జమ అయినట్లు అర్థం. ఒకవేళ ‘పెండింగ్’ లేదా ‘ఇన్‌యాక్టివ్ ఎన్‌పీసీఐ’ అని వస్తే, మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లేదా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి కాలేదని అర్థం చేసుకోవాలి.
Advertisement