Advertisement

కిషన్ రావు పేట పంచాయతీ రికార్డుల మాయం

మన పత్రిక, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కిషన్ రావు పేట గ్రామ పంచాయతీలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నెలకొన్న వివాదం ఆరు నెలలుగా కొనసాగుతోంది. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సర్పంచ్, పాలకవర్గం, మరియు పాత కార్యదర్శి కృష్ణారెడ్డి మధ్య ఈ సమస్య జటిలమైంది. గతంలో అధికారుల పాలనలో ఉన్నప్పుడు రూ. 8 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేశానని, ఆ మొత్తాన్ని చెల్లించాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే, సరైన బిల్లులు సమర్పిస్తేనే డబ్బులు చెల్లిస్తామని పాలకవర్గం స్పష్టం చేస్తోంది.

మాయమైన రికార్డులు

పాత కార్యదర్శి కృష్ణారెడ్డి బదిలీపై వెళ్తూ గ్రామ పంచాయతీకి సంబంధించిన కీలక రికార్డులను తనతో పాటు తీసుకెళ్లారు. దీనివల్ల ప్రస్తుతం కొత్త కార్యదర్శికి మరియు పాలకవర్గానికి పనులు నిర్వహించడం కష్టంగా మారింది. రికార్డులు లేకపోవడంతో గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమస్యపై మండల పరిషత్ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని, వారు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కుమ్మరి సునీత అధికారులను కోరారు.

Advertisement
Advertisement