Advertisement

తమ్మినేని సీతారాంపై భూకబ్జా కేసు: నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో రిజిస్ట్రేషన్

మన పత్రిక: వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో శాసనసభాపతిగా పనిచేసిన తమ్మినేని సీతారాం భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏపీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ పరిధిలోని బలగ గ్రామంలో కట్ట కనక లింగేశ్వర రావు కొనుగోలు చేసిన 922 చదరపు గజాల స్థలాన్ని తమ్మినేని ఆక్రమించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ భూమిని తన కుమారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కనక లింగేశ్వర రావు చనిపోయినట్టు మున్సిపాలిటీలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిలతో పాటు రజిని, సలిపల్లి లక్ష్మణరావు, సతీష్ కుమార్, త్రినాధ్ ప్రధాన నిందితులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కూన పెద్దిరాజు అనే డాక్యుమెంట్ రైటర్ సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించారని, రిజిస్ట్రేషన్ సమయంలో తమ్మినేని డిగ్రీ కాలేజీ సిబ్బందితో సాక్షులుగా సంతకాలు పెట్టించారని దర్యాప్తులో బయటపడింది. కోట్లాది రూపాయల విలువైన ఈ భూమి వ్యవహారంలో రజిని నేతృత్వంలోని ముఠా కీలక పాత్ర పోషించిందని, ఆమె ఒడిశాలోని జయపూర్ నుండి వచ్చి అక్రమాలకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement