Advertisement

పనితీరు తగ్గినా ఉద్యోగిని ప్రోత్సహించిన ముంబై స్టార్టప్

మన పత్రిక, ముంబై: సాధారణంగా కంపెనీలలో ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోతే తొలగింపులు చోటుచేసుకుంటాయి. కానీ ముంబైకి చెందిన ‘బ్లూ ల్యాబ్ స్టర్ మీడియా’ అనే కంటెంట్ ఆధారిత బి టు బి స్టార్టప్ సంస్థ అందుకు భిన్నంగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించింది. సంస్థలో కంటెంట్ ఆపరేషన్స్ లీడ్ గా పనిచేస్తున్న ఆర్య ఫడ్నీస్ పనితీరు గత కొంతకాలంగా తగ్గడంతో, ఆ కంపెనీ యజమాని ధ్రువ్ ముఖర్జీ ఆమెకు వినూత్నమైన మద్దతును అందించారు.

ఉద్యోగికి పెయిడ్ గెట్ అవే

పూణే నుండి రిమోట్ గా పనిచేస్తున్న ఆర్య ఫడ్నీస్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన కారణాల వల్ల పనిలో నాణ్యత తగ్గడం, జాప్యం జరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ధ్రువ్ గుర్తించారు. ఈ విషయమై ఆమెతో చర్చించిన యజమాని, ఆమెను తొలగించడానికి బదులుగా ఒక అందమైన ఎయిర్ బియన్ బిలో మూడు రోజులపాటు ‘పెయిడ్ గెట్ అవే’ ఏర్పాటు చేశారు. ఇందులో రెండు రోజులు ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసేలా, ఒక రోజు పూర్తి విశ్రాంతి తీసుకునేలా ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఆమెకు సమీపంలోని కో-వర్కింగ్ స్పేస్ లో డెస్క్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ ఖర్చులన్నీ కంపెనీయే భరించింది.

Advertisement

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనపై ధ్రువ్ లింక్డిన్ లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగులు కూడా మనుషులేనని, తప్పులు జరిగినప్పుడు తొలగించడం కంటే సానుభూతి చూపడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ మానవీయ దృక్పథాన్ని నెటిజన్లు ప్రశంసిస్తుండగా, సదరు కంపెనీలో పనిచేయడానికి ఉద్యోగార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement