Advertisement

నీట్ పేపర్ లీక్: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సిపిఎం డిమాండ్

మన పత్రిక: నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలకు సంఘీభావం తెలుపుతూ, సోమవారం జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సోనం వాంగ్ చుక్ చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించడం దారుణమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కంటే పదవులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement