మన పత్రిక, గుంటూరు: గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో ఓ మహిళపై జరిగిన అమానుష దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. నిందితులపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, సమాజంలో ఇలాంటి అనాగరిక చర్యలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనలో ప్రమేయం ఉన్న స్థానిక టీడీపీ కార్యకర్త, 21వ డివిజన్ పార్టీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీలోని అన్ని పదవుల నుండి, ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ అండదండలు ఉన్నా చట్టం ఎవరినీ వదిలిపెట్టదని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మహిళలను అవమానిస్తే సహించే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?
ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీలో ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి వద్ద మోటార్ ద్వారా నీరు పట్టుకుంటుండగా వివాదం మొదలైంది. మోటార్ తొలగించాలని మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్తుండగా, మూర్తి సోదరి (ట్రాన్స్జెండర్ మాధవి) ఆమెపై దాడి చేశారు. అనంతరం నడిరోడ్డుపై ఆమెను వెంటాడి, దుస్తులు చించేసి వివస్త్రను చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధితురాలు వేడుకుంటున్నప్పటికీ కనికరించని నిందితులను స్థానిక మహిళలు అడ్డుకుని, ఆమెకు దుస్తులు అందించి కాపాడారు.
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రమణమూర్తితో పాటు మొత్తం 9 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
