Advertisement

మేడిపల్లిలో యువతి మృతి మిస్టరీ: నగ్నంగా వీధుల్లో పరుగులు

మన పత్రిక, మేడిపల్లి: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని పీర్జాదిగూడ శంకర్‌నగర్‌లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న ఆ యువతి, శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:30 గంటల సమయంలో బయటకు వచ్చింది. తన తల్లి నిద్రిస్తున్న గదికి బయట నుంచి తాళం వేసి, నగ్నంగా వీధుల్లోకి వచ్చి పరుగులు తీసింది.

సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

యువతి వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ సమయంలో ఆమె సమీపంలోని ఒక ఆలయంలోకి ప్రవేశించి, అక్కడి విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఈ విస్తుపోయే ఘటన తర్వాత, తెల్లవారేసరికి ఆమె సమీపంలోని ఒక చెరువులో మృతదేహమై కనిపించింది.

Advertisement

పోలీసుల దర్యాప్తు

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు, మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యువతి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరిగిందా లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Advertisement