Advertisement

Mahabubnagar Road Accident : మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

మన పత్రిక, మహబూబ్‌నగర్: పాలకొండ జంక్షన్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు వ్యక్తుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న కారును, అత్యంత వేగంగా వచ్చిన ఒక రేసింగ్ బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ పెను విషాదం చోటుచేసుకుంది.

ప్రమాద తీవ్రతకు కారు పల్టీలు కొట్టగా, బైక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులతో పాటు బైక్ నడుపుతున్న యువకుడు కూడా ఉన్నట్లు తెలిసింది. అలాగే, ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జంక్షన్ వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచికలు ఉన్నప్పటికీ, మితిమీరిన వేగమే ఈ ప్రాణాపాయానికి దారితీసిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement