మన పత్రిక, న్యూఢిల్లీ: అగ్నివీర్లకు (Agniveers) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు పంపిన విషయాన్ని సైనిక్ సంక్షేమ శాఖ డైరెక్టర్ (రిటైర్డ్) బ్రిగేడియర్ మదన్ షీల్ శర్మ అధికారికంగా వెల్లడించారు.
2027 నాటికి తమ నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న అగ్నివీర్లకు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని హోం మంత్రి ఆ లేఖలో సూచించారు. త్రివిధ దళాల్లో పనిచేసిన వారికిచ్చే రిజర్వేషన్ల తరహాలోనే.. అగ్నివీర్లకు కూడా రాష్ట్ర పోలీసు కానిస్టేబుళ్లు, ఫారెస్ట్ గార్డులు, జైలు వార్డెన్లు, ఫైర్‌మెన్, ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF), మైనింగ్ గార్డులు, ప్రత్యేక పోలీసు అధికారులు తదితర విభాగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
కాగా, అగ్నివీర్లకు తమ రాష్ట్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి. పోలీస్, జైలు వార్డెన్ తదితర విభాగాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యం ఇస్తామని హర్యానా ప్రభుత్వం అందరికంటే ముందుగా ప్రకటించగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం పోలీసు, ఇతర విభాగాల్లో వారికి రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేసింది. కేంద్రం తాజా లేఖతో మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
