మన పత్రిక, వెబ్‌డెస్క్: వెంకటేష్ సినిమాలను ఎంచుకోవడంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, నటనలోనూ అంతే పరిణితి ప్రదర్శిస్తారు. దానికి నిలువెత్తు నిదర్శనమే ‘బ్రహ్మపుత్రుడు’. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వచ్చిన ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లోనే ఒక మైలురాయి. దాదాపు 41 కేంద్రాల్లో 100 రోజుల పోస్టర్ పడిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇందులో వెంకటేష్ నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వరించడం విశేషం. తమిళంలో విజయవంతమైన ‘మైఖేల్ రాజా’ (రఘువరన్, శరత్ బాబు నటించిన చిత్రం) సినిమాకు ఇది రీమేక్.
కథలోని బ్రహ్మ పదార్థం సాధారణంగా అర్థం కాని విషయాలను ‘బ్రహ్మ పదార్థం’ అంటుంటాం. కానీ ఈ సినిమా పరిభాషలో ఎవరికి పుట్టారో తెలియని వారే బ్రహ్మపుత్రులు. ఇదొక బ్రహ్మపుత్రుడు (వెంకటేష్), ఒక బ్రహ్మపుత్రిక (బేబీ షాలిని)ల కథ. తమ తండ్రుల అన్వేషణలో వీరిద్దరూ ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారు, బ్రహ్మపుత్రికను ఆమె తండ్రి (మోహన్ బాబు) దగ్గరకు చేర్చడానికి హీరో పడ్డ కష్టాలే ఈ సినిమా ఇతివృత్తం. చివరకు బుద్ధి తెచ్చుకోని తన తండ్రిని చంపి హీరో చట్టానికి లొంగిపోవడంతో సినిమా ముగుస్తుంది. ఇందులో బేబీ షాలిని నటన అద్భుతం అని చెప్పక తప్పదు.
నటీనటుల విశ్వరూపం ఈ సినిమాలో వెంకటేష్, బేబీ షాలిని తర్వాత చెప్పుకోవాల్సింది ప్రతినాయకుల గురించి. నూతన్ ప్రసాద్, మోహన్ బాబు ఇద్దరూ తమ పాత్రల్లో జీవించారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంటుంది. మోహన్ బాబుకు నమ్మినబంటుగా ఉంటూనే, బేబీ షాలినిని రక్షించే పాత్రలో వెంకటేష్ నటన ఆకట్టుకుంటుంది. జయసుధ జర్నలిస్టుగా, గతం మరిచిపోయిన పిచ్చిదానిగా శ్రీవిద్య నటన సినిమాకు ప్రాణం పోశాయి. నిర్మాత రామానాయుడు సెంటిమెంట్ ప్రకారం డాక్టర్ పాత్రలో మెరిశారు.
దాసరి మార్క్ స్క్రీన్ ప్లే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం గుహనాధన్ కథ అయితే.. దానికి దాసరి నారాయణరావు అందించిన బిర్రయిన స్క్రీన్ ప్లే, పదునైన డైలాగులు వెన్నముకగా నిలిచాయి. సినిమా ఎక్కడా స్లో కాకుండా దడదడా సాగిపోతుంది. ఇందులో మోహన్ బాబుకు ‘రన్నింగ్ కామెంట్రీ’ అనే ఊతపదాన్ని పెట్టడం విశేషం. చక్రవర్తి సంగీతంలో వేటూరి, దాసరి రాసిన పాటలు సూపర్ హిట్. ముఖ్యంగా ‘అమ్మ తోడు లేకున్నా.. నాన్న తోడు లేకున్నా..’ అనే పాట ఇప్పటికీ ఎంతోమందిని కదిలిస్తుంది.
పురాణాల ప్రకారం స్వాయంభువ మనువును (బ్రహ్మ దేవుడి శరీరం నుంచి పుట్టినవాడు) బ్రహ్మపుత్రుడు అంటారు. కానీ దర్శకుడు దాసరి తనదైన శైలిలో సినిమాకు తగినట్లుగా ఈ టైటిల్ కు నిర్వచనం ఇచ్చి ప్రేక్షకులను మెప్పించారు. 1988 జులైలో వచ్చిన ఈ ఎమోషనల్ క్లాసిక్ నేటికీ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
