Advertisement

శంకరపల్లిలో వారణాసి సినిమా షూటింగ్

మన పత్రిక, సినిమా: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఇండియన్ సినిమాల్లో ‘వారణాసి’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శంకర్‌పల్లి ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తూ బృందం వేగంగా పనులు కొనసాగిస్తోంది.ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత చిత్ర యూనిట్ కొద్దిరోజుల విరామం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ గ్యాప్‌లో మహేష్ బాబు విదేశాలకు వెకేషన్‌కు వెళ్లనుండగా, రాజమౌళి తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం మళ్లీ షూటింగ్‌ను పునఃప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన సుమారు 80 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు అనుగుణంగానే షూటింగ్ పనులు వేగవంతం చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement