మన పత్రిక: టెలికాం రంగంలో కీలక పరిణామంగా, నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. టారిఫ్ విధానాల్లో పారదర్శకత నిబంధనలు పాటించలేదని గుర్తించిన ట్రాయ్, వెంటనే మార్పులు చేయాలని సూచించింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు విధించింది. నివేదికల ప్రకారం, జియో రెండు కీలక అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు ట్రాయ్ పేర్కొంది. ముఖ్యంగా కంపెనీ తన అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో టారిఫ్ ప్లాన్లను ఒకే విధంగా చూపించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. జియో యాప్, వెబ్సైట్, రిటైల్ స్టోర్లలో ఒకే రకమైన రీఛార్జ్ ప్లాన్లు, ధరలు ఉండాలని ఆదేశించింది. వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో వేర్వేరు ప్లాన్లు చూపించడం లేదా కొన్ని ప్లాన్లను దాచిపెట్టడం వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తుందని ట్రాయ్ అభిప్రాయపడింది.
అదేవిధంగా, డివైజ్ ఆధారంగా ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడాన్ని కూడా ట్రాయ్ నిరాకరించింది. కొన్ని ప్లాన్లు కేవలం కొన్ని ఫోన్లు లేదా పరికరాలకే పరిమితం కాకుండా, అన్ని వినియోగదారులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఏ ఫోన్ అయినా ఒకే ప్లాన్ పనిచేసేలా ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక ట్రాయ్ ఆదేశాలపై జియో స్పందిస్తూ, తాము అన్ని నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, అవసరమైన చోట మార్పులు చేస్తామని తెలిపింది. ఈ పరిణామం టెలికాం రంగంలో వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు కీలకంగా భావిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
