మన పత్రిక, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ చరిత్రను డిజిటల్ రూపంలో చూపేందుకు చేపట్టిన శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో టీటీడీ ఈ ప్రపంచస్థాయి పునర్నిర్మాణాన్ని నిర్వహిస్తోంది. బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ ఏడాది జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సుమారు మూడు ఎకరాల్లోని 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇప్పటికే లక్ష చదరపు అడుగుల మేర పనులు పూర్తయ్యాయి. ఇక్కడ మొత్తం 14 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దుతున్నారు. అన్నమాచార్య గ్యాలరీ, వివిధ రాజవంశీయులతో శ్రీవారికి ఉన్న అనుబంధాన్ని తెలిపే ప్రదర్శనలతో పాటు, క్యాఫెటీరియా సదుపాయాలు భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి.
