మన పత్రిక వెబ్డెస్క్, తిరుపతి: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ (SIT) దూకుడు పెంచింది. ఏడాదికి పైగా కొనసాగుతున్న ఈ దర్యాప్తు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ కేసులో మరో కీలక ముందడుగు వేస్తూ, జనవరి చివరి నాటికి రెండో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.
నెల్లూరు కోర్టులో దాఖలు ఇప్పటికే ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాల నమోదు, డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయింది. ప్రస్తుతం తుది చట్టపరమైన పరిశీలనలో ఉన్న సిట్.. రాబోయే రెండు వారాల్లో నెల్లూరు ఏసీబీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ మేరకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఇటీవల తిరుపతిలో సిట్ అధికారులతో (IG, DIG స్థాయి అధికారులతో) సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
36 మంది నిందితులు.. కొత్తగా అరెస్టులు? ఈ కేసులో ఇప్పటివరకు సిట్ 36 మందిని నిందితులుగా చేర్చింది. కల్తీ నెయ్యి సరఫరాకు అనుమతులు ఇవ్వడంలో కొందరు టీటీడీ అధికారులు, డెయిరీ నిపుణులు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది.
- కీలక పరిణామం: కేసులో ఏ-34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు ఇటీవలే కొట్టివేసింది.
- మరికొన్ని అరెస్టులు: సమగ్ర ఛార్జిషీట్ దాఖలు చేసే లోపే మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశాన్ని సిట్ పరిశీలిస్తోంది. టీటీడీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నిర్ధారించిన అధికారులు.. గతంలో మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పలువురు బోర్డు సభ్యులను విచారించిన సంగతి తెలిసిందే.
ఈ ఛార్జిషీట్ దాఖలు తర్వాత, దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. దీంతో తదుపరి అరెస్టులు ఎవరివి? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
