తల్లికి వందనం అనర్హుల జాబితాలో పేరుంటే సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు

మన పత్రిక: Thalliki Vandanam (తల్లికి వందనం) పథకంలో అర్హత ఉండి కూడా సాంకేతిక లోపాల వల్ల అనర్హుల జాబితాలో పేరు వచ్చిన లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన ఆధారాలతో స్థానిక సచివాలయంలో గ్రీవెన్స్ సమర్పిస్తే అధికారుల పరిశీలన అనంతరం తిరిగి పథకం డబ్బులు పొందవచ్చు.

వివిధ సమస్యలకు తీసుకెళ్లాల్సిన ఆధారాలు

ఏ సమస్య వల్ల పేరు అనర్హుల జాబితాలోకి వెళ్లిందో దానికి తగిన ధ్రువీకరణ పత్రాన్ని సచివాలయ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. వివిధ లోపాలకు అవసరమైన ఆధారాల వివరాలు ఇలా ఉన్నాయి:

  • కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటినట్లు వస్తే విద్యుత్ శాఖ అందించిన మీటర్ డీ-సీడింగ్ రసీదును చూపించాలి.
  • నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లు నమోదైతే, అది కేవలం ఆటో లేదా ట్రాక్టర్ అయితే దానికి సంబంధించిన ఆర్‌సి బుక్ కాపీ అందించాలి.
  • ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు వస్తే, నిజానికి పన్ను కట్టని వారు చార్టర్డ్ అకౌంటెంట్ (సిఏ) ఇచ్చిన సర్టిఫికెట్ సమర్పించాలి.
  • పొలం లేదా భూమికి సంబంధించిన సమస్య ఉంటే 1బి లేదా అడంగల్ రికార్డులు తీసుకెళ్లాలి.
  • ప్రభుత్వ ఉద్యోగం కింద పొరపాటున సిఎఫ్ఎమ్ఎస్ ఐడీ నమోదైతే సంబంధిత మినహాయింపు ధృవీకరణ పత్రం ఇవ్వాలి.
  • పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే తల్లి మరియు విద్యార్థి సరైన ఆధార్ కార్డులు తీసుకెళ్లాలి.

Download Thalliki Vandanam Grievance Form

గ్రీవెన్స్ నమోదు చేసుకునే విధానం

సమస్యకు సంబంధించిన ఆధారాలతో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ కాపీలు తీసుకుని సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ ఉండే డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ సెక్రటరీ సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి గ్రీవెన్స్ నమోదు చేస్తారు. అధికారులు ఆ వివరాలను వెరిఫై చేసిన తర్వాత అర్హులైన వారి పేర్లు తిరిగి జాబితాలోకి వస్తాయి.