Advertisement

TG: ప్రభుత్వ తీరుపై ‘గులాబీ’ గర్జన.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్!

మన పత్రిక, హైదరాబాద్: పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వద్దనే పోలీసు శాఖ ఉన్నప్పటికీ నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడే పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ పాలనలో పోలీసులకు గౌరవం లభించిందని, అనేక పోస్టులను భర్తీ చేసి కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పోలీసుల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. టీఏలు, డీఏలు, సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పోలీసుల భద్రతా పథకాన్ని పరిమితం చేయడాన్ని తప్పుబట్టారు. పోలీసు శాఖలో ప్రమోషన్లు నిలిచిపోయాయని, ఈహెచ్‌ఎస్ అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. 2024 తర్వాత నియామకాలు చేపట్టలేదని, వేలాది ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. బడ్జెట్ తగ్గింపుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

Advertisement

అలాగే ఆర్టీసీ ఉద్యోగుల హామీల అమలు, బీసీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సమస్యలపై సమాధానం ఇవ్వకపోవడంతో నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యులు ప్రకటించారు.

Advertisement