WhatsApp
Advertisement

TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అధికారులు శుభవార్త చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) ఆదివారం టీజీ పీజీఈసెట్-2026 (TG PGECET) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎం.టెక్, ఎం.ఫార్మసీ తదితర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఈ ఎంట్రెన్స్ పరీక్ష అత్యంత కీలకం కానుంది.

ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. టీజీ పీజీఈసెట్-2026 కన్వీనర్, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 27వ తేదీ (శుక్రవారం) ఉదయం 11:30 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి, అలాగే పరీక్షకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను తెలుసుకోవడానికి https://pgecet.tgche.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగానే వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివేట్ అవుతుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని నిబంధనలను, అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదువుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) సహకారంతో, వారి మార్గదర్శకత్వంలో జేఎన్‌టీయూహెచ్ ప్రతి ఏటా ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో పీజీ సీట్లను ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేయడానికి ఈ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Advertisement