Advertisement

TG: ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌.. మెనూ ఇదే..!

మన పత్రిక, తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ అమలుకు అధికారులు కసరత్తు పూర్తి చేసి, వారాంతపు మెనూను సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బలవర్ధక అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.720 కోట్లను కేటాయించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది.

విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, డ్రాప్‌ఔట్‌లను నియంత్రించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. పిల్లలకు బోర్ కొట్టకుండా, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిల్లెట్లు, పౌష్టికాహార పదార్థాలతో మెనూను రూపొందించారు. సోమవారం దోశ-పాలు, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ-రాగి జావ, బుధవారం పూరీ-పాలు, గురువారం మిల్లెట్ ఇడ్లీ-రాగి జావ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-పాలు, శనివారం బోండా-రాగి జావ ఇవ్వనున్నారు.

Advertisement

క్యాల్షియం, ఐరన్ లోపాలను నివారించేందుకు వారానికి మూడు రోజులు రాగి జావ, మిగతా రోజులు పాలను అందించనున్నారు. ఆహార నాణ్యతపై రాజీ లేకుండా పాఠశాల యాజమాన్య కమిటీలు, అధికారులు పర్యవేక్షణ చేపట్టనున్నారు

Advertisement