WhatsApp
Advertisement

TG TET Results 2026 : వచ్చే వారమే రిలీజ్.. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) రాసిన లక్షలాది మంది అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు ముగిసి ప్రాథమిక ‘కీ’ కూడా విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు తుది ఫలితాలపైనే ఉంది. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అంటే వచ్చే వారంలోనే అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఈసారి గతంతో పోల్చితే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 71,670 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఉండటం విశేషం.

ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/ ద్వారా తమ స్కోర్ కార్డును పొందే వెసులుబాటు ఉంటుంది. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ‘టీజీ టెట్ జనవరి – 2026 ఫలితాలు’ అనే లింక్ అందుబాటులోకి వస్తుంది. దానిపై క్లిక్ చేసి, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే స్క్రీన్‌పై ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. అక్కడ నుంచి స్కోర్ కార్డును ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డీఎస్సీ (DSC) నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉండటంతో అభ్యర్థులు మంచి మార్కుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకే కాకుండా, ప్రైవేట్ పాఠశాలల్లో బోధించడానికి కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈ పరీక్షకు పోటీ పెరిగింది. ఒకప్పుడు ఏడాదికి ఒక్కసారే నిర్వహించే ఈ పరీక్షను, ఇప్పుడు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుండటం అభ్యర్థులకు కలిసివచ్చే అంశం. టెట్‌లో అర్హత సాధించిన వారే డీఎస్సీ రాసేందుకు అర్హులు కాబట్టి, ఈ ఫలితాలు ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. విద్యాశాఖ ప్రస్తుతం ఫలితాల విడుదలకు సంబంధించిన తుది కసరత్తును వేగవంతం చేసింది.

Advertisement