Advertisement

తెలంగాణలో ఈనెల 24న విద్యాసంస్థల బంద్

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ బంద్ నిర్వహణపై హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విద్యార్థి నాయకులు టి.నాగరాజు, కె.మణికంఠ రెడ్డి, వెంకట్ స్వామి వివరాలు వెల్లడించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యుఐ, పిఎస్‌డియు, ఏఐఎఫ్‌డిఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బంద్‌ను విజయవంతం చేసేందుకు విద్యా సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని వారు కోరారు. బంద్ రోజున రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.

Advertisement
Advertisement