Advertisement

Rythu Bharosa: ఆ భూములకు డబ్బులు కట్..

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పథకంలో కీలక మార్పులు చేసింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధులను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఈసారి చాలా మందికి నిధులు అందకపోవచ్చని తెలుస్తోంది. కేవలం పంటలు పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.

10 లక్షల ఎకరాలకు కోత? గత ప్రభుత్వ హయాంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ (పంట పండించకపోయినా, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఉన్నా) రైతు బంధు అందేది. దీనివల్ల నిజమైన సాగుదారులకు నష్టం జరుగుతోందని, అనర్హులు లబ్ది పొందుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అందుకే ఇకపై సాగులో ఉన్న భూములకే సాయం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, నిజమైన రైతులకు మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

శాటిలైట్ మ్యాపింగ్‌తో జల్లెడ: అసలైన రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం టెక్నాలజీని వాడుకుంటోంది. ‘సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఏజెన్సీ’ (Synthetic Aperture Radar) సాయంతో క్షేత్రస్థాయిలో శాటిలైట్ మ్యాపింగ్‌ నిర్వహిస్తోంది. దీనిద్వారా బీడు భూములు, కమర్షియల్ ప్లాట్లను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తున్నారు.

65 లక్షల మందికి లబ్ది: ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరికి ఈ యాసంగి సీజన్‌లో ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందనుంది.

Advertisement