Advertisement

TG News: తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం

తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం: సీఎం రేవంత్ రెడ్డి

మన పత్రిక, వెబ్​డెస్క్: మీర్‌ఖాన్‌పేట్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) తొలిరోజు ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువ రాష్ట్రమైన తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.

Advertisement

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 (Telangana Rising 2047) నాటికి తెలంగాణ సాధించాల్సిన ప్రగతిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సీఎం వివరించారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 2.9 శాతం ఉన్న తెలంగాణ, జాతీయ జీడీపీలో 5 శాతం వాటాను అందిస్తోందని, దీనిని 2047 నాటికి 10 శాతానికి పెంచడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ, సమగ్ర ప్రగతి కోసం రాష్ట్రాన్ని మూడు ప్రత్యేక ఎకానమీ జోన్‌లుగా విభజించినట్లు సీఎం తెలిపారు. అవి:

  1. CURE (Core Urban Region Economy): సేవా రంగం, పట్టణ ఆర్థిక వ్యవస్థ.
  2. PURE (Peri Urban Region Economy): తయారీ రంగం, నగర శివారు ఆర్థిక వ్యవస్థ.
  3. RARE (Rural Agriculture Region Economy): గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ.

నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నిపుణుల సలహాలు, ప్రజల అభిప్రాయాలతో ఈ విజన్‌ను రూపొందించినట్లు చెప్పారు. చైనాలోని గ్వాంగ్‌ డాంగ్ ప్రావిన్స్ తరహాలో తెలంగాణను అభివృద్ధి చేస్తామని, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల నుంచి ప్రేరణ పొంది వాటితో పోటీ పడతామని సీఎం స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement