Advertisement

పంచాయతీ ఫలితాలే మా పాలనకు గీటురాయి.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం 12,702 పంచాయతీలకు గాను 7,527 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా గెలవగా, మరో 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారని వివరించారు. మొత్తంగా 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్, బీజేపీ కూటమి కేవలం 33 శాతం (బీఆర్ఎస్ 3,511, బీజేపీ 710) స్థానాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగ్గా.. 87 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించిందని గణాంకాలను వివరించారు.

సంక్షేమమే మా విజయ ఆయుధం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన తర్వాత వచ్చిన ఈ ఫలితాలను తమ పాలనకు గీటురాయిగా భావిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 61 వేల ఉద్యోగాల భర్తీ వంటి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపించాయని అన్నారు. ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుంటూ, మరోవైపు దుబారాను తగ్గిస్తూ ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి నేటి పంచాయతీ ఫలితాల వరకు ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం ఉంచారని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

కేసీఆర్‌కు సీఎం సవాల్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల తీర్పు చూసైనా బీఆర్ఎస్ నేతలు బుద్ధిగా మసలుకోవాలని హితవు పలికారు. “నదీ జలాలపై మాట్లాడేందుకు దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలి. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కేవలం ఆరంభం మాత్రమేనని, 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 2/3 వంతు మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఈ సందర్భంగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.

Advertisement