Advertisement

నిమ్స్‌లో 813 పోస్టులు.. 73 కొత్త డయాలసిస్ కేంద్రాలు: మంత్రి దామోదర

నిమ్స్‌లో 813 ఉద్యోగాలు.. కొత్తగా 73 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి దామోదర కీలక ప్రకటన

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన, నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 73 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే పనిచేస్తున్న 105 కేంద్రాలకు ఇవి అదనమని, ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై నిరుద్యోగులకు మంత్రి శుభవార్త చెప్పారు. నిమ్స్‌లో 213 మంది వైద్యులు సహా మొత్తం 813 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి కోరినట్లు తెలిపారు.

Advertisement

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాల ఏర్పాటుపై మంత్రి సభలో వివరాలు వెల్లడించారు. దాదాపు రూ.58 కోట్ల వ్యయంతో 485 కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామని, ఇవి ఫిబ్రవరి నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి) ముగిసేలోపు రూ.192 కోట్లతో ఉస్మానియా, గాంధీ సహా ఆరు ఆసుపత్రుల్లో 8 కొత్త ఎంఆర్‌ఐ (MRI) మెషీన్లు, రూ.60 కోట్లతో 8 సీటీ స్కాన్ (CT Scan) యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. క్యాన్సర్ రోగుల కోసం నిమ్స్‌లో రూ.32 కోట్ల విలువైన లీనియర్ యాక్సిలరేటర్, రూ.8 కోట్ల బ్రాకీథెరపీ యంత్రాలను సమకూర్చుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ సేవలనూ బలోపేతం చేశామన్నారు. గత రెండేళ్లలో అంబులెన్స్ సేవలను విస్తరించడం ద్వారా అత్యవసర ప్రతిస్పందన సమయాన్ని (Response Time) 16 నిమిషాల నుంచి 11 నిమిషాలకు తగ్గించగలిగామని మంత్రి తెలిపారు. దీన్ని 10 నిమిషాల కంటే తక్కువకు తెచ్చేందుకు అదనపు అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నామన్నారు. 90 శాతం కేసులకు జిల్లా స్థాయిలోనే వైద్యం అందేలా రెఫరల్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Advertisement