Advertisement

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2026 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీ తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. తాజా జాబితా ప్రకారం.. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

మహిళా ఓటర్లే అధికం.. నిజామాబాద్ టాప్ పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం ఓటర్లలో 25,62,369 మంది పురుషులు ఉండగా, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 640 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు నమోదయ్యారు.

Advertisement
  • అత్యధికం: నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా, మున్సిపాలిటీల్లో ఆదిలాబాద్ (1,43,655) ప్రథమ స్థానంలో ఉంది.
  • అత్యల్పం: కొత్తగూడెం కార్పొరేషన్‌లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో కేవలం 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
  • సూర్యాపేట మున్సిపాలిటీలో 1,08,848 మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళలే (56,664) అధికం.

బీసీ రిజర్వేషన్లు 34 శాతం? ఓటర్ల జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపై పడింది. ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. కాగా, వెనుకబడిన తరగతుల (బీసీ) డెడికేటెడ్ కమిషన్.. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. మొత్తం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిలో.. ఎస్సీ, ఎస్టీలకు కలిపి సుమారు 15 శాతం కేటాయించి, మిగిలిన వాటాను బీసీలకు ఇవ్వాలని కమిషన్ నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి తక్కువగా ఉన్నందున ఈ కోటా సవరణను కమిషన్ సమర్థించుకుంది. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు కానుండగా, జనవరి 20 లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Advertisement