Advertisement

తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు

మన పత్రిక, సిద్దిపేట: తెలంగాణ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో రూపుదిద్దుకుంటోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ వంతెనను హృదయాకారంలో (లవ్ సింబల్) డిజైన్ చేయడం దీని ప్రత్యేకత.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో రూ.4.22 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్లాస్ బ్రిడ్జితో పాటు చెరువు పరిసరాలను పూర్తిస్థాయి వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, గార్డెన్లు, ప్రత్యేక లైటింగ్, సెల్ఫీ పాయింట్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, మరో రెండు మూడు నెలల్లో సాంకేతిక, భద్రతాపరమైన తనిఖీలను పూర్తి చేసి అధికారికంగా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలి గాజు వంతెన కావడంతో నిర్మాణం జరుగుతుండగానే దీనిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

Advertisement