మన పత్రిక వెబ్డెస్క్, న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటిస్తున్న ‘ఉచితాల సంస్కృతి’ (Freebie Culture)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. ఇలాంటి ధోరణి దేశ ఆర్థిక పురోగతికి గొడ్డలి పెట్టు లాంటిదని సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. తక్షణమే ఈ ఉచిత విధానాలపై పునఃసమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.
తమిళనాడుకు చెందిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (Tangedco) దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిరుపేదలకు సాయం చేయడం రాష్ట్రాల బాధ్యతే అయినప్పటికీ, బిల్లులు చెల్లించే స్తోమత ఉన్నవారికి కూడా ఉచితాలు పంచడం ఏంటని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా పలు కీలక అంశాలను లేవనెత్తింది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయని, అభివృద్ధిని విస్మరించి, అప్పుల్లో ఉన్నప్పటికీ ఇలాంటి ఉచిత పథకాలను ఎలా ప్రకటిస్తారని నిలదీసింది. రాష్ట్రాలు వసూలు చేసే ఆదాయంలో 25 శాతాన్ని కేవలం ఉచితాలకే కేటాయిస్తే, ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
నిజంగా చెల్లించలేని నిరుపేదలకు సాయం చేయడం సంక్షేమం అవుతుందని, కానీ అందరికీ ఉచితంగా పంచడం కేవలం రాజకీయ బుజ్జగింపు చర్యేనని కోర్టు కుండబద్దలు కొట్టింది. ఇది దేశంలో ఏ రకమైన సంస్కృతిని ప్రోత్సహిస్తోందని విస్మయం వ్యక్తం చేసింది. వనరులను ఉచితంగా పంపిణీ చేసే బదులు, నిరుద్యోగ నిర్మూలన వంటి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పక్కా ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందించాలని సుప్రీంకోర్టు గట్టిగా సూచించింది.
కేవలం ఒక రాష్ట్రం గురించి మాత్రమే తాము మాట్లాడటం లేదని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్య అని జస్టిస్ జైమాల్య బాగ్చీ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలు చేసేటప్పుడు ఆయా ఖర్చులకు సరైన సమర్థన ఉండాలని, కేవలం జీతాలు చెల్లించడం, ఉచితాలు పంచడమే రాష్ట్రాల పని కాకూడదని హితవు పలికారు. అభివృద్ధి ప్రాజెక్టుల కంటే ఉచిత పథకాలకే ప్రాధాన్యత ఇస్తుండటం దేశ భవిష్యత్తుకు ఏమాత్రం క్షేమకరం కాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
