మన పత్రిక, వెబ్డెస్క్: రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత (5.21 లక్షలు), తాత్కాలిక (4.93 లక్షలు) ఉద్యోగులందరి వివరాలను ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ’ (IFMIS)లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగుల పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ల నమోదుకు అక్టోబర్ 25వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
ఈ ప్రక్రియ బాధ్యత ఆయా కార్యాలయాల్లోని జీతాల డ్రాయింగ్ అధికారులదేనని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ, చాలా విభాగాల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో గడువులోగా వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం ఆపేయాలని ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగుల సమగ్ర వివరాలు లేకపోవడంతో కొన్ని కార్యాలయాల్లో అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కొందరు తాత్కాలిక ఉద్యోగులు మానేసినా వారి పేరుతో వేతనాలు డ్రా చేయడం, మరికొందరు అనధికారికంగా సుదీర్ఘ సెలవులో ఉన్నా జీతాలు తీసుకోవడం వంటివి జరుగుతున్నట్లు సమాచారం. ఈ అక్రమాలు బయటపడతాయనే భయంతోనే చాలామంది వివరాలు ఇవ్వడంలేదన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

