మన పత్రిక: ‘రోజా’ చిత్రంలో చిన్ని చిన్ని ఆశ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ గాయని మిన్మిని, దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విధించిన కఠినమైన ‘ఎక్స్‌క్లూజివ్’ ఒప్పందాల వల్లే తన కెరీర్ తీవ్రంగా నష్టపోయిందని ఆమె వెల్లడించారు.
ఇళయరాజా దగ్గర పాడే గాయకులు మరెవరికీ పాడకూడదనే ఆంక్షల వల్లే, ఏఆర్ రెహమాన్ వంటి కొత్త సంగీత దర్శకులతో పనిచేసే అవకాశాలు కోల్పోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కెరీర్ అత్యున్నత దశలో ఉన్న 1993-94 ప్రాంతంలో లండన్‌లో జరిగిన స్టేజ్ షోలో వోకల్ కార్డ్స్ దెబ్బతినడంతో మిన్మిని సుదీర్ఘకాలం పాటు గొంతును కోల్పోయారు.
దాదాపు దశాబ్దంన్నర తర్వాత ఆమె గొంతు తిరిగి యధాస్థితికి చేరుకోవడంతో మలయాళ చిత్రాల్లో మళ్లీ కొన్ని పాటలు పాడారు. పి.జె. రోసలిన్ అసలు పేరుగా కలిగిన మిన్మిని, ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో ‘మిన్మినిస్ మ్యూజిక్ అకాడమీ’ని నడుపుతూ యువ ప్రతిభావంతులకు సంగీత శిక్షణ ఇస్తున్నారు.
