Advertisement

Shambhala movie Review: శంబాల రివ్యూ.. ఆది సాయికుమార్ హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

Shambhala telugu movie review: మన పత్రిక, వెబ్​డెస్క్: కథేంటంటే.. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శంబాల గ్రామంలో 1980వ దశకంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఆకాశం నుంచి పడిన ఓ ఉల్కను ఆ గ్రామస్తులు ‘బండ భూతం’గా కొలుస్తుంటారు. అయితే, ఆ ఉల్క పడినప్పటి నుంచి ఊరిలో వింతలు, దారుణాలు మొదలవుతాయి. ఆవు పాల బదులు రక్తం ఇవ్వడం, వరుస హత్యలు, ఆత్మహత్యలు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తాయి. ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ విక్రమ్ (ఆది సాయికుమార్)ను ఆ గ్రామానికి పంపిస్తుంది. అక్కడికి వెళ్లిన విక్రమ్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు దేవి (అర్చన అయ్యర్) పాత్రకు, ఈ ఘటనలకు సంబంధం ఏంటి? గ్రామ దేవత చరిత్రకు, జరుగుతున్న దారుణాలకు లింక్ ఏంటి అన్నది వెండితెరపై చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే.. ఇప్పటివరకు లవర్ బాయ్, కమర్షియల్ హీరో పాత్రల్లో కనిపించిన ఆది.. ఇందులో సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ పరిణితి కనబరిచారు. ఇక దేవి పాత్రలో అర్చన అయ్యర్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియెన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తుంది. రవి వర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్ తమ పాత్రల పరిధి మేరకు నటించి భయాన్ని కలిగించారు. బేబీ చైత్ర పాత్ర కూడా కథలో కీలకంగా ఉండి ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమాలో ప్రతి పాత్రకు ఒక పర్పస్ ఉండటం విశేషం.

Advertisement

సాంకేతిక వర్గం పనితీరు దర్శకుడు యుగంధర్ ముని టీజర్, ట్రైలర్‌లో కథను దాచిపెట్టి, థియేటర్‌లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో సఫలమయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా గ్రామం, అక్కడి వింతలతో ఆసక్తికరంగా సాగుతూ నెమ్మదిగా టెన్షన్ పెంచుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. సెకండాఫ్‌లో మిస్టరీ వీడే క్రమం వేగంగా సాగుతుంది. అయితే క్లైమాక్స్ కొందరికి రొటీన్‌గా అనిపించవచ్చు. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు నిజమైన హీరోలు. విజువల్స్ అద్భుతంగా ఉండగా, ఆర్ఆర్ సీన్లను ఎలివేట్ చేసింది. కేవలం శబ్దంతోనే భయపెట్టడంలో మ్యూజిక్ డైరెక్టర్ సఫలమయ్యారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.

చివరగా.. హారర్, మిస్టరీ, మైథాలజీ జానర్లను ఇష్టపడే వారికి ‘శంబాల’ మంచి ఛాయిస్. లాజిక్కులు వెతకకుండా, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు థియేటర్‌లో ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.

రేటింగ్: 3.5/5

Advertisement