ఏపీలో స్క్రబ్ టైఫస్ పంజా.. రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృతి, అధికారుల హెచ్చరిక
మన పత్రిక, వెబ్‌డెస్క్: Scrub Typhus | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ తీవ్రత కొనసాగుతోంది. ప్రధానంగా విజయనగరం (Vizianagaram) , పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధి సోకి ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతులలో విజయనగరం జిల్లాకు చెందిన సీహెచ్ రాజేశ్వరి, పల్నాడుకు చెందిన ఎం. జ్యోతి, వై. నాగమ్మ, బాపట్ల జిల్లాకు చెందిన ఎస్కే మస్తాన్‌బీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సంతోషి ఉన్నారు. పొలాల్లో, తోటల్లో పనిచేసే రైతులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
‘ఓరింయెంటియా సుట్సుగముషి’ అనే బ్యాక్టీరియా ద్వారా స్క్రబ్ టైఫస్ వ్యాపిస్తుంది. నల్లిని పోలిన ‘చిగ్గర్ మైట్’ (Chigger Mite) అనే కీటకం కుట్టడం వల్ల ఇది మనుషులకు సంక్రమిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ప్రత్యేకమైన టీకా అందుబాటులో లేదు. కాబట్టి ముందు జాగ్రత్తలే దీనిని నివారించడానికి ఏకైక మార్గం. ఏదైనా కీటకం కుట్టినట్లు అనిపించినా, చర్మంపై కాలిన గాయం వంటి మచ్చలు లేదా దద్దుర్లు కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలి.
జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఒకటి, రెండు రోజులకు మించి ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. కానీ ఆలస్యం చేస్తే మాత్రం ప్రాణాపాయం తప్పదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
