Advertisement

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విజయవాడలో జరుగుతూ వచ్చిన స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలను ఈసారి నుంచి రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day) రాజధాని ముస్తాబవుతోంది.

10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ రాజధానిలోని మంత్రుల బంగ్లాలకు ఎదురుగా ఉన్న 10 ఎకరాల సువిశాల స్థలంలో పరేడ్ గ్రౌండ్‌ను సీఆర్డీఏ (CRDA) సిద్ధం చేస్తోంది. సందర్శకుల వాహనాల కోసం మరో 10 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 24న ఇక్కడ పూర్తిస్థాయి డ్రస్ రిహార్సల్స్ నిర్వహించనున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా వాటర్‌ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

గవర్నర్ చేతుల మీదుగా.. వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొని సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, సుమారు 500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. రాజధాని గ్రామాలు, విజయవాడ, గుంటూరు నుంచి సుమారు 10 వేల మంది ప్రజలు ఈ వేడుకలను తిలకించడానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆకట్టుకోనున్న శకటాలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా ప్రత్యేక శకటాల ప్రదర్శన ఉండనుంది. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మూడు శకటాలకు బహుమతులు అందజేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, లోక్‌భవన్ తదితర ప్రభుత్వ భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

Advertisement