Advertisement

సిద్ధిపేట | పండుగ పూట వర్షంలో యూరియా కోసం రైతుల పోరాటం

మన పత్రిక, వెబ్​డెస్క్ : సిద్ధిపేట ( SIDDIPET ) జిల్లా నంగునూరు మండల ( Nanganoor Mandal ) కేంద్రంలో వినాయక చవితి పండుగ రోజు రైతులు యూరియా బస్తాల కోసం వర్షంలోనే క్యూ కట్టారు. ఉదయం నుంచే వందలాది మంది రైతులు ఆగ్రోస్ కేంద్రం ఎదుట నిలబడ్డారు. కురుస్తున్న భారీ వర్షాన్ని లెక్క చేయకుండా వారు టోకెన్ల కోసం పోటీ పడ్డారు. ఆ రోజు కేంద్రానికి 554 యూరియా బస్తాలు మాత్రమే అందాయి. కానీ క్యూలో ఉన్న రైతులు చాలా మంది. టోకెన్లు, ఆధార్ కార్డులు ముందస్తుగా సేకరించినా, బస్తాలు సరిపోకపోవడంతో అర్హులైన చాలామందికి యూరియా లభించలేదు.

దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొంతమంది మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా రాజగోపాల్ పేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన రైతులు మండల వ్యవసాయ అధికారి బి. గీతను అడ్డుకున్నారు. ఆమె కారు చుట్టూ గుమిగూడి రెండు గంటల పాటు కదలనివ్వలేదు. తమకు యూరియా లభించే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు చేరుకుని సమాచారం ఇవ్వడంతో రైతులు చివరికి చెదిరారు. పండుగ పూట కూడా యూరియా కొరత నుంచి విముక్తి కలగడం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement