Advertisement

Polavaram Project: డిసెంబర్ 2027 నాటికి పూర్తి – సీఎం చంద్రబాబు

మన పత్రిక వెబ్​డెస్క్, పోలవరం: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు, భద్రతా చర్యలను మంత్రులు, అధికారులతో కలిసి సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న అడ్డంకులను దశలవారీగా తొలగించి, పనులను తిరిగి గాడిలో పెట్టామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో దాదాపు 87 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

నిర్వాసితులకు న్యాయం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల పునరావాసం (R&R) తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని చంద్రబాబు తేల్చిచెప్పారు. నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని, రాబోయే 12 నెలల్లో ఆర్ అండ్ ఆర్ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.

Advertisement

2027 నాటికి పూర్తి 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాలని, ప్రతి నెలా పనుల పురోగతిపై సమీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement