Advertisement

Ola, Uber strike today: ఓలా, ఉబెర్, రాపిడో సమ్మె: నేడు చక్రం తిప్పని డ్రైవర్లు..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత వాహన సేవలపై ఆధారపడే ప్రయాణికులకు శనివారం (ఫిబ్రవరి 7) తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్ వంటి సంస్థలకు చెందిన డ్రైవర్లు ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ పేరుతో నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ సేవలకు భారీగా అంతరాయం కలగనుంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU)తో పాటు పలు జాతీయ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి.

ఈ సమ్మెకు ప్రధాన కారణం ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల వ్యవస్థ లేకపోవడమేనని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అగ్రిగేటర్ సంస్థలు తమ ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తూ లాభాలు గడిస్తున్నాయని, కానీ రాత్రింబవళ్లు కష్టపడే డ్రైవర్లు మాత్రం ఆదాయ భద్రత లేక పేదరికంలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ప్రకారం డ్రైవర్, కార్మిక సంఘాలతో చర్చించి తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘కనీస బేస్ ఛార్జీలను’ నోటిఫై చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

వాణిజ్య అవసరాల కోసం ప్రైవేట్ వాహనాలను వినియోగించడాన్ని కఠినంగా నిషేధించాలని, లేదా వాటిని నిబంధనల ప్రకారం కమర్షియల్ కేటగిరీలోకి మార్చాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం డ్రైవర్లందరూ మూకుమ్మడిగా రైడ్-హెయిలింగ్ యాప్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల దేశంలోని ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగే ప్రమాదం ఉంది. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లకు వెళ్లే వారు ముందుగానే ఆర్టీసీ బస్సులు, మెట్రో లేదా సొంత వాహనాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement