Advertisement

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

మన పత్రిక, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయనతో పాటు రితేష్ రెడ్డి, నమిత శర్మలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను మంగళవారం ఉప్పరపల్లి న్యాయస్థానం తిరస్కరించింది.

దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, ఇప్పుడు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందన్న పోలీసుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్, సరఫరాదారుల వివరాలు రాబట్టేందుకు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై కస్టడీ పిటిషన్‌ను విచారించిన కోర్టు, తీర్పును బుధవారానికి రిజర్వ్ చేసింది.

Advertisement

ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఏ1 రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ పార్టీ వీడియోలు, ఫోన్ కాల్ డేటాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసు కస్టడీపై బుధవారం వెలువడే తీర్పు ఆధారంగా ఈ కేసు తదుపరి విచారణ కొనసాగనుంది.

Advertisement