మన పత్రిక వెబ్‌డెస్క్, నల్గొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి, జీవిత ఖైదు అనుభవిస్తున్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
దీనిని విచారించిన హైకోర్టు.. శ్రవణ్ కుమార్ వయసును, ఆయన ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని ఊరటనిచ్చింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో నల్గొండ కోర్టు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.
కేసు పూర్వాపరాలు.. 2018లో అమృత వర్షిణి, ప్రణయ్ కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేక అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ను హత్య చేయించారు. రూ. కోటి సుపారీతో బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ అనే హంతకుడిని ఏర్పాటు చేశారు. 2018 సెప్టెంబర్ నెలలో గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రి నుంచి తీసుకువస్తుండగా, ఆమె కళ్లెదుటే ప్రణయ్‌ను గొడ్డలితో నరికి చంపారు. ఈ దారుణ ఘటన సిసిటీవీలో రికార్డై దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. విచారణ దశలోనే 2020లో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
