మన పత్రిక, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ బృందావన్ కాలనీకి చెందిన వీకే అశోక్ (45), పూర్ణిమ (36) దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఓ 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అశోక్ ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తుండగా, పూర్ణిమ ఇంటి వద్దే పిల్లలకు ట్యూషన్లు చెప్పేది.
అయితే, గత ఏడాది కాలంగా అదే కాలనీకి చెందిన పాలేటి మహేశ్ (22) అనే యువకుడితో పూర్ణిమకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన అశోక్.. ఆమెను పలుమార్లు మందలించాడు. భర్త తీరుతో తమ సంబంధానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని భావించిన పూర్ణిమ, ప్రియుడు మహేశ్‌తో కలిసి భర్తను హత్య చేయడానికి పథకం రచించింది.
ఈ ఘాతుకానికి మహేశ్ తన స్నేహితుడు సాయికుమార్ (22) సహాయం కోరాడు. పథకం ప్రకారం ఈ నెల 11న మధ్యాహ్నం మహేశ్, సాయికుమార్ పూర్ణిమ ఇంటికి వచ్చి ఓ గదిలో దాక్కున్నారు. సాయంత్రం అశోక్ ఇంటికి రాగానే, ముగ్గురూ కలిసి అతడిపై దాడి చేశారు. కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకొని చున్నీతో గొంతు బిగించి అశోక్‌ను దారుణంగా హత్య చేశారు.
అనంతరం అశోక్ గుండెపోటుతో మరణించాడని పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. రిపోర్టులో గొంతు బిగించడం వల్లే మృతి సంభవించిందని తేలడంతో పోలీసులు పూర్ణిమను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె నేరం అంగీకరించి అసలు విషయం బయటపెట్టింది. పోలీసులు పూర్ణిమతో పాటు మహేశ్, సాయికుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
