Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, అసలు హీరో ఆయనే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలనటుడిగా చేసిన సినిమాల్లో చాలా ప్రత్యేకమైన చిత్రం ఒకటుంది. అదే ‘కొడుకులు దిద్దిన కాపురం’. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే హీరో చిన్నప్పటి పాత్రలోనో, సహాయ పాత్రలోనో కనిపిస్తారు. కానీ ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం (Dual Role) చేసి, సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు. అందుకే ఇది చైల్డ్ ఆర్టిస్ట్ సినిమా కాదు, మహేశ్ బాబే అసలు హీరో అని విశ్లేషకులు అంటున్నారు. పద్మాలయా బ్యానర్‌పై కృష్ణ స్వీయ దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది.

కథేంటంటే? హరనాథ్, జమున నటించిన ‘లేత మనసులు’ సినిమా తరహాలోనే విడిపోయిన తల్లిదండ్రులను కవల పిల్లలు కలపడమే ఈ చిత్ర కథాంశం. అయితే అందులో ఆడపిల్లలు కాగా, ఇందులో మగ కవలలు కావడంతో ఫైటింగులు, టీజింగులు అదనంగా చేర్చారు. హీరో కృష్ణ, హీరోయిన్ విజయశాంతి దంపతులకు ఇద్దరు పిల్లలు పుడతారు. చేయని నేరానికి కృష్ణ జైలు పాలవడంతో, విజయశాంతి ఆయనను అపార్థం చేసుకుంటుంది. పిల్లలిద్దరూ వేర్వేరుగా పెరుగుతారు. చివరకు ఇద్దరు మహేశ్ బాబులు కలిసి విలన్ల ఆటకట్టించి, తల్లిదండ్రులను ఎలా కలిపారన్నదే మిగతా కథ.

Advertisement

మహేశ్ నటన, పాటలు హైలైట్ రాజ్య-కోటి సంగీత సారథ్యంలో వేటూరి రాసిన పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా మహేశ్ బాబు ఎంట్రీ సాంగ్ ‘ఓం నమ నటరాజుకే నమ’, మోహన్ బాబును టీజ్ చేసే ‘హే మామా హే మామా’ పాటల్లో మహేశ్ డ్యాన్సులు, హుషారు అప్పట్లోనే ప్రేక్షకులను మెప్పించాయి. జూం చక్కా ఎంచక్కా, బహూపరాక్ ఓ మహారాణీ వంటి డ్యూయెట్లు కూడా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో ఫైట్లను త్యాగరాజన్ కొత్తగా కంపోజ్ చేశారు.

Advertisement