మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. అంతకంటే ముందు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తామని, తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశామే తప్ప, ఎప్పుడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదని, ప్రత్యర్థుల కుటుంబాలను వేధించలేదని కేటీఆర్ అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేకనే ప్రభుత్వం రోజుకో కొత్త డ్రామా ఆడుతోందని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన అంతరాత్మ సాక్షిగా చెబుతున్నానని, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
గత కొన్నేళ్లుగా తనపై తీవ్రమైన వ్యక్తిత్వ హననం (Character Assassination) జరుగుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులని, హీరోయిన్లతో సంబంధాలని తనతో పాటు తన కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. అయినా తాను ఎవరికీ భయపడలేదని, ఇప్పుడు కూడా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన జేజమ్మ వచ్చినా భయపడమని సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పే దమ్ము డీజీపీకి, ఇంటెలిజెన్స్ ఐజీకి, కమిషనర్ సజ్జనార్‌కు ఉందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఈ కేసును ఇంతటితో వదిలిపెట్టబోమని కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు, తన క్యారెక్టర్ అస్సాసినేషన్‌కు కారణమైన రేవంత్ రెడ్డిని, ఆయనకు తొత్తులుగా పనిచేస్తూ లీకులు ఇస్తున్న కొంతమంది పోలీసు అధికారులను వదిలిపెట్టనని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, తాము మాత్రం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
