మన పత్రిక, వెబ్‌డెస్క్
తాజా సమాచారం ప్రకారం, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ( Kinjarapu Rammohan Naidu ) చేపట్టిన ప్రతిష్టాత్మక ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమంలో ఆదివారం ఆర్.ఆర్.బీ, గ్రూప్ డీ ( RRB Group D ) అభ్యర్థుల కోసం నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది.
శ్రీకాకుళం నగరంలోని కాకినాడ ఆదిత్య కళాశాలలో జరిగిన ఈ మాక్ టెస్ట్‌కు 244 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ తీరు పట్ల అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఈ మాక్ టెస్ట్ ఎంతో ఉపయుక్తంగా ఉందని చెప్పారు.
కొద్ది రోజుల క్రితం మాక్ టెస్ట్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రకటించగానే వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి. దీంతో నిర్వాహకులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి, పకడ్బందీగా పరీక్షను నిర్వహించారు. ప్రశ్నాపత్రం ఆర్.ఆర్.బీ ప్రధాన పరీక్ష స్థాయిలోనే ఉండడంతో అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఇది ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు.
ఎర్రన్న విద్యా సంకల్పం ద్వారా డీఎస్పీ, గ్రూప్స్, కానిస్టేబుల్, ఆర్.ఆర్.బీ వంటి పోటీ పరీక్షలకు సమాయత్తం చేస్తూ, నిష్ణాతులతో తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి అవసరమైన మెటీరియల్ కూడా అందిస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షల్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉపాధి చేరువ చేసే మార్గంగా నిలుస్తోంది.
ఈ పరీక్షను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అభ్యర్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

