మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశమయ్యేలా ‘కవిత కుట్రలు – పార్ట్ 1’ పేరుతో ‘ఉత్తమ్ బీఆర్ఎస్’ రాసిన ఓ ఆసక్తికరమైన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూనే.. ఎమ్మెల్సీ కవిత తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్న కేటీఆర్‌పై కవిత ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారనే కోణంలో ఈ కథనం సాగింది.
కేటీఆర్ విజయాలు vs కవిత ఓటమి 2009 నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన కేటీఆర్, 2010లో ఏకంగా 68,000 మెజారిటీ సాధించి పార్టీకి బలమైన శక్తిగా ఎదిగారని సదరు పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, 2014లో ఎంపీగా గెలిచిన కవిత.. 2019లో పార్టీకి హవా ఉన్నప్పటికీ నిజామాబాద్‌లో ఘోరంగా ఓడిపోయారని గుర్తు చేశారు. దీనికి కారణం ఆమె అహంకారం, మంద బుద్ధేనని విమర్శించారు. ఓటమి తర్వాత పోరాడకుండా, రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు పొందినా, పార్టీ కోసం పని చేయకుండా సొంత ఆడంబరాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్ రాజకీయంగా ఎదుగుతుంటే చూసి నేర్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.
సొంత పార్టీపైనే విషం ఆంధ్రోళ్లతో దోస్తీ కారణంగానే కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారని, దీనివల్ల ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వచ్చాయని ఆ పోస్ట్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి వచ్చాక మారకపోగా.. అన్న కేటీఆర్ ఇమేజ్ చూసి తట్టుకోలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో కలిసి ఫోన్ ట్యాపింగ్ అంటూ నిందలు వేయడం, సొంత తండ్రి కేసీఆర్, బావ హరీష్ రావుపైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనపైనా ఆమె దాడి చేయడం సరికాదని హితవు పలికారు.
జాగృతి యాత్రకు స్పందన నిల్ ప్రస్తుతం కవిత చేపట్టిన ‘జాగృతి జనం బాట’ యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదని, కేవలం డబ్బు బలంతో, సోషల్ మీడియా హంగామాతో నెట్టుకొస్తున్నారని విమర్శించారు. సీనియర్ నాయకులను అవమానిస్తూ, రౌడీ మూకలను వెంటేసుకుని తిరిగితే పెద్ద లీడర్ కాలేరని హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా చరిత్రలో ఆమె స్థానం గుండు సున్నాగానే మిగిలిపోతుందని ‘ఉత్తమ్ బీఆర్ఎస్’ ఆ పోస్ట్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
