WhatsApp
Advertisement

Karimnagar Mayor Seat : ‘16వ తేదీన ఏమవుతుందో చూద్దాం’.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్, కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఫలితాల అనంతరం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆ పార్టీకి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మేయర్ పీఠంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ కూడా రేసులో ఉన్నట్లు మంత్రి పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 69 డివిజన్లు ఉండగా, బీజేపీ 30 స్థానాల్లో గెలిచింది. అయితే మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఇది సరిపోదని, నిజామాబాద్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ లేదని మంత్రి పొన్నం గుర్తుచేశారు. గతంలో తమ పార్టీ కేవలం 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకున్న చరిత్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

మరోవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకుని మేయర్ పీఠం తమదేనని ప్రకటించారు. దీనిపై స్పందించిన పొన్నం, బీజేపీ ఇండిపెండెంట్లను కలుపుకోవడం నైతికమా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలకు కూడా తమవైన వ్యూహాలు ఉంటాయని, ఉత్తర తెలంగాణ అభివృద్ధి కోసం మంచి పాలకవర్గం ఉండాలన్నది తమ అభిమతమని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన కార్పొరేటర్లే మేయర్‌ను ఎన్నుకుంటారని, ఇందులో మంత్రుల జోక్యం ఉండదని చెబుతూనే.. 16వ తేదీన (మేయర్ ఎన్నిక రోజు) ఏమవుతుందో చూద్దాం అంటూ మంత్రి సస్పెన్స్ క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేకపోయినప్పటికీ, ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి మాటలను బట్టి అర్థమవుతోంది. దీంతో 16న జరగబోయే మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది.

Advertisement