మన పత్రిక, ఖమ్మం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఖమ్మంలో పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదలకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, హైదరాబాద్కు తరలించారు.
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని కవిత ఆరోపించారు. ఆ బాధితులకు అండగా నిలుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహారాజ్తో కలిసి సోమవారం రాత్రి నుంచి ఆమె ఈ దీక్షకు దిగారు. అయితే, పోలీసులు అక్కడికి చేరుకుని వారి దీక్షను అడ్డుకోవడంతో పాటు అరెస్టు చేశారు.
పోలీసుల చర్యపై కవిత తీవ్రంగా స్పందించారు. తనను అరెస్టు చేసినా నిరాహార దీక్షను విరమించేది లేదని, దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని ఈ సందర్భంగా కవిత తేల్చిచెప్పారు.
